all

Thursday, November 22, 2012

కార్తీకంలో మన కర్తవ్యం
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తి క నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయా లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కృత్తికా నక్షత్రం
sivaఈ కృత్తికానక్షత్రం నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ లలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమార స్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖ ములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక దీపాలు
ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను.ఈ మాసాన భక్తులు తండోపతండాలుగా నెయ్యి తీసుకుని అరుణాచలకొండ (తమిళనాడులోని) మీద జ్యోతిని వెలిగిస్తారు. ఈ జ్యోతి చాలా రోజుల వరకు వెలుగుతూ పరిసరప్రాంతాలన్నింటికీ కనబడుతూ ఉంటుంది.ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజ లను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు.

ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ అమితానందాన్ని చేకూరుస్తూ కన్నుల పండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తా రు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ విధంగా ఈ మాసమంతా నిత్యదీపారాధనతో వెలుగుతో నిండి ఉంటుంది. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.

కార్తీక సోమవారాలు
ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథము డైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తమున నదీ స్నానమాచ రించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తూ హిందూ ప్రజలంతా భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు.

శివప్రీతికరమైన సోమవారమున భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియ మాలను పాటించవలెను. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. ఈ కార్తీక సోమవారాలలో వనభోజనం చేస్తారు. ఉసిరిక చెట్టుకింద భోజన చేయడం వల్ల శుభప్రదమని ప్రతీతి. ఈ సోమవారాలలో శివుడిని అర్చించి అనంతరం అన్నదానమును నిర్వహించి, అతిథి సత్కారాల తరువాత దీక్షవహించిన వ్యక్తి భుజించవలెను. ఈ నియమముల వలన శివాను గ్రహంకలిగి సర్వ పాపములు నశించును.

తులాసంస్థే దినకరే కార్తికే మాసి యో నరః
స్నానం దానం పితృశ్రాద్ధ మర్చనం శుద్ధమానసః
తదక్షయ్యఫలప్రాహుర్యత్కరోతి నరేశ్వర
సక్రమం వా సమారభ్య మాసమేకం నిరంతరమ్‌
మానస్య ప్రతిపద్యాం వా ప్రారభేత్కార్తికవ్రతమ్‌
నిర్వఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే
ఇతి సంకల్ప్య విధిత త్పశ్చాత్స్నానం సమాచరేత్‌


Untit6ఏ మనుష్యూడైనను తులారాశియందు సూర్యుడుండగా కార్తీకమాసమందు సూర్యోదయ కాలమునకు లేచి కాలకృత్యంబులు నిర్వర్తించి, నదీస్నాన మొనరించి, జపము, దేవపూజ, తీర్థవిధి మొదలగు కార్యములను జేసినచో గొప్ప ఫలంబు సంప్రాప్తించునని యుందురు . సూర్యుడు తులారాశి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలుకొనిగాని వ్రతారంభమును చేయవలయును. అట్లు ప్రారంభించు సమయమున ఓ కార్తీక దామో దార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ జరుగునట్లు చేయుము అని పిమ్మట స్నానము చేయవలెను.ఆ విధముగ జీవనదికి బోయి గంగకును, శ్రీ మన్నా రాయణునకును, భైరవునకును నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి,

మార్జన మంత్రముతో, అఘమర్షణ మంత్రముతో, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా చరింపవలెను. పిదప సూర్యున కర్ఘ్య ప్రదానమొసంగి దేవతలకును, ఋషూలకును, పితృదేవతలకును క్రమ ప్రకారముగ తర్పణంబు లొనర్పవలెను. అప్పుడది సుస్నామగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము జేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయవలెను. కార్తీకమాసంబున గంగా గోదావరి కావేరీ తుంగభద్రాది నదులందు స్నానమొనర్చిన నత్యుత్తమము, గంగానది కార్తీకమాసమునందు నదులన్నిటి యందు ద్రవరూప సన్నిహితయై యుండును. శ్రీ ఆదినారాయణుండు గోష్పాద మాత్ర ప్రదేశమందున్న జలమునందు సన్నిహితుడై యుండునని వేదములు, శ్రుతీసృ్మతులు చెప్పుచున్నవి కావున సముద్ర కామియగు నదీ స్నానము మిగుల పవిత్రమైనది.

నదీ స్నానావకాశము లభింపనిచో! కాలువ యందుగాని, చెరువునందుగాని, కూపము కడగాని సూర్యోద యము స్నానము చేయవలెను. ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీ పురుషూలకు ముఖ్యము. మడి బట్టలను ధరించి ముందుగ భగవంతుని స్మరింపవలెను. తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరింపవలెను. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వపుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరము సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞమును ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకుని దేవతార్చనమును చేయవలెను. దేవపూజకు తన యింటి దొడ్డిలోగాని, తోటలోగాని లభించిన పుష్పములనే స్వయముగ తెచ్చి ఉపయోగించుట ప్రధాన ధర్మము. స్నానతీర్థమునందే కార్తీక పురాణ శ్రవణమును గావించుకుని, స్వగృహంబునకుబోయి, అతిథిపూజ, వైశ్వదేవము మొదలగు నిత్యకర్మలను చేసి, తృప్తిదీర భుజించి, రెండుమారులు ఆచమనీయం చేసిన శుద్ధుడగును.

Unti6పిదప పురాణమును స్వయముగా జదువుటయో, లేక ఇతరులవలన వినుటయో చేయవలెను. సూర్యు డస్తమించు కాలమున సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణ్వాలయమునగాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను బూచించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదు లతో గూడిన నైవేద్యము నిడవలయును, అటు పిమ్మట చేతులు మోడ్చి మంత్రములచేగాని, స్తోత్రములచేగాని, గీతములచే గాని అష్టపదులచేగాని హరిహరులను స్తుతిచేయవలెను. ఈ రీతిగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాస్య తుదివరకు నెలదినములు వ్రతము చేసినచో కార్తీకమాస వ్రతము పూర్తగును.

మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూతతృప్తి గావించవలెను. ఇట్లు వ్రతమాచరించిన స్త్రీలు, పురుషూలకు ఈ జన్మమునందును, పూర్వజన్మమునందును నొనరించిన పాపంబులు పటాపంచలై, పవిత్ర వంతులై మోక్షార్హులగుదురు. ఇందు సందేహం ఏమాత్రమూ లేదు. మరియు నిట్లు చేయనవకాశములేక చేయువారితోగూడి సంతసించినను సమానమగు ఫలితము నందుదురు.

 
 
 
 

No comments: