all

Thursday, November 22, 2012

పెరిటి ఔషధాలతో ఇంటిల్లిపాదికి ఆరోగ్యం...!

ఇంటి ముంగిట్లో, నాలుగు మొక్కలుంటే పచ్చగా కళకళ్లాడుతుంది. అదే అపార్ట్ మెంట్ అయితే కుండీల్లో ఒదిగిన మొక్కలు వచ్చిపోయే వారికి స్వాగత పలుగకుతాయి. చిన్నమొక్కలే కదా అనుకుంటే పొరపాటే మనస్సు పెట్టి ఎంచుకుంటే అలంకరణకు ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ముఖ్యంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషదమొక్కలు పెంచుకుంటే చాలు ఇంట్లో ఉండే చిన్న..పెద్ద..ముసలి అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుతాయి. అందులో కొన్ని మీకోసం...

కరివేపాకు: కరివేప లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ, పులిహోరలోనూ కరివేప లేకపోతే రుచే రాదు. అయితే కరివేపాకు వల్ల వంటకాలకు రుచి, సువాసన మించి దానివల్ల ఉపయోగాలు లేవనుకుంటే అది పొరపాటే. కరివేపలో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపను విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది. కరివేపను కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
చందనం మొక్క: దీనికి తేమగల పొడి నేలలు అవసరము. ఈ మొక్క భూమి నుండి నేరుగా నీటిని, పోషకాలను గ్రహించలేదు. వేరే మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకొని నీటిని, పోషకాలను గ్రహిస్తుంది. చందనం మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి చర్మసంరక్షణకు ఎంతో మేలు..చందనము వ్యాధి నిరోధక శక్తిని మరియు మేధస్సును పెంచే గుణము కలది. చందనపుచెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన కలిగియుండి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, చర్మ సంబందిత మందుల తయారీలో వినియోగిస్తున్నారు. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు. చందనం వాడకంతో సౌందర్యం పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖాన్ని చంద్రబింబంలా ఉంచే శక్తి చందనానికు ఉంది.
కలబంద: ఇంటిలో పెంచేందుకు పెద్ద స్దలం అవసరం లేదు. చిన్న కుండీలోను కలబందను పెంచవచ్చు. ప్రతినిత్యం రెండుపూటలా నీరును అందిస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మార్కెట్లో వివిధ రకాల్లో ఈ మొక్కలు లభిస్తున్నాయి. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం అవుతాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

Herbal Plant Home Garden Aid0069
తమలపాకులు: ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి.తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.
తులసి: తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు.ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది. సాధారణంగా అకు పచ్చ రంగులో ఉండేది లక్ష్మి తులసి. కృష్ణ తులసి ఆకులు, కొమ్మలు కాస్త నలుపు కలిసి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని ఆకు ఘాటుగా ఉంటుంది. ఔషద విలువలు రెండింటిలోనూ ఒకే రకంగా ఉంటాయి.ఇది వర్షాకాలం దగ్గు, జలుబు, జ్వరం కలిసికట్టుగా దాడిచేస్తాయి. తులసితో వాటన్నింటినీ ఎదుర్కొనవచ్చు..

No comments: