చాలా మంది ఆధునిక తల్లిదండ్రులు పొగడ్తల ద్వారా తమ పిల్లలను దారిలోకి తీసుకురావచ్చుననీ, వాళ్ళకు మేలు జరుగుతుందనీ భావిస్తారు. అది కొంత వరకు మాత్రమే నిజం.శృతి మించితే, సరైన పద్ధతిలో లేకపోతే , ఆ పొగడ్త పిల్లలకు అపకారాన్ని కలుగజేసే ప్రమాదం కూడా ఉంది. ప్రశంస అనేది ఎప్పుడూ పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచే దిగా, వాళ్ళకు భద్రతా భావాన్ని అందించేదిగా ఉండాలి గాని దీనికి నేను తగుదునా? అని అనుకునేట్లూ, ఆ ప్రశంస స్థాయిలో వాళ్ళు ఉత్తమంగా ఉండటానికి ప్రయత్నించి విఫలమై ఆందోళనకు గురయ్యే విధంగా ఉండకూడదు.
ఏ ప్రశంసా ముఖస్తుతితో కూడుకుని ఉండకూడదు. ప్రశంస కుర్రవాడి పట్ల కాక అతను సాధించిన తీరుపట్ల ఉండాలి. కుర్రవాడికి తనమీద తనకు అంత నమ్మకం లేకపోతే మన పొగడ్త పట్ల అనుమానంగా చూస్తాడు. లేకపోతే ఆ పొగడ్తకు తగ్గ లెవెల్‌లో ఉండటానికి ప్రయత్నించి చేతకాక చతికిలబడితే తనమీద తాను విశ్వాసాన్ని కోల్పోతాడు.ప్రతి కుర్రవాడికీ తన వ్యక్తిత్వం, క్యారెక్టర్‌లకు సంబంధించి కొన్ని అభిప్రాయాలంటూ ఉంటాయి. మన ప్రశంసలు ఆ అభిప్రాయాలకు తగ్గట్లు వాస్తవ బద్ధంగా అనునయపూర్వకంగా నిర్మాణాత్మకంగా ఉండాలి. అలా లేనప్పుడు అతను గందరగోళంలో పడి ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.. కాబట్టి పిల్లల్ని ఎటువంటి పొగడాలో చూద్దాం...
1. మీ పిల్లలు మంచి ప్రవర్తనను, మంచితనాన్ని చూపితే వెంటనే వారిని పొగడండి. కానీ పొగడ్తలతో ముంచేయవద్దు.
2. ఏ పనికైనా సరిగ్గా చేసినందుకు సానుకూలమైన మాటలతో ప్రోత్సహించండి.
3. చిన్న విషయమైనా సరే ప్రతి రోజూ పొగుడుతూ వుండండి. అయితే పదే పదే వద్దు.
4. నువ్వు పెద్దవారి పట్ల చాలా చక్కగా / మంచిగా ప్రవర్తించావురా !' అని ప్రశంసించండి.
5. నువ్వు చిత్రలేఖనంలో మంచి నేర్పు గలవాడనని, సానుకూలమైన పొగడ్తలు చేస్తే, వాడు మంచి పనులు, మరి ఏ పనైనా సరియైన పద్ధతిలో చేయగలుగుతాడు.
6. మీ మాటలే వారి గొప్ప బహుమానాలవ్వాలి. అంతేగాని వస్తువులు ఇవ్వవద్దు.
7. వ్యతిరేక ధోరణిలో మాట్లాడవద్దు, తిట్టవద్దు, మంచి సమయాన్ని మీ పిల్లల పనులతో గడపండి.
8. పిల్లల పనులలో మీ శ్రద్ధ వారికి సానుకూల దృక్పథాన్ని, గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి.
9. పిల్లలను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి. వారితోనే భోజనం చెయ్యటం, ఆ రోజు గడపటం చెయ్యండి.
[ మీ వ్యాఖ్య రాయండి ]