all

Wednesday, November 21, 2012

amma maata -kids story

అమ్మ మాట
చిట్టి కథ
ఒక కోడికి పది పిల్లలు ఉన్నాయి. వాటిని చూసి తల్లి కోడి మురిసిపోయేది. ‘ప్రమాదం పొంచి ఉంటుంది. నన్ను విడిచి దూరంగా పోకండి’ అని పదే పదే హెచ్చరించేది. కానీ ఆ మాట పెద్ద పిల్లకి నచ్చేది కాదు. ఓసారి తల్లి లేని సమయం చూసి, ‘‘అమ్మ మనల్ని ఇంకా చిన్న పిల్లల్లాగానే చూస్తోంది. మనం దూరంగా వెళ్లి ఆడుతూ పాడుతూ హాయిగా ఉండటం అమ్మకిష్టం లేదు’’ అంది.

కొన్ని పిల్లలు ‘అవును’ అన్నాయి. కొన్ని పిల్లలు ‘కాదు. అమ్మ మన మేలు కోరే చెబుతుంది’ అన్నాయి.
‘‘మీ ఖర్మ. హాయిగా జీవించాలి అనుకునేవాళ్లు నాతో రండి’’ అని పెద్దపిల్ల ముందుకి దారితీసింది. కొన్ని పిల్లలు దాన్ని అనుసరించాయి. ఆడుతూ పాడుతూ ఆహారం వెతుక్కుంటూ తిరగసాగాయి. అంతలో ఓ గద్ద చడీ చప్పుడు కాకుండా రివ్వున వచ్చి ఓ పిల్లని తన్నుకుపోయింది.

పిల్లలన్నీ కెవ్వున కేక వేసి, భయభ్రాంతులై తల్లి దగ్గరికి పరుగుతీశాయి.
‘‘అమ్మ ఎంత చెబుతున్నా వినకుండా మనం అన్నయ్యతో వెళ్లి చిట్టిచెల్లిని పోగొట్టుకున్నాం. ఇకనుంచి అమ్మ మాట విని బుద్ధిగా ఉందాం’’ అంది ఒక పిల్ల.
‘‘అవును. నా తప్పువల్ల అనవసరంగా మన ముద్దుల చెల్లిని పోగొట్టుకున్నాం. ఇక నుంచి అమ్మ మాట జవదాటకూడదు’’ అంది తల్లి దగ్గరకు పరుగుతీస్తూ పెద్ద పిల్ల.

నీతి: అమ్మ మాట బంగారు బాట.

No comments: