all

Wednesday, November 21, 2012

జుట్టు రాలకుండా సహజపద్దతులతో పరిష్కార మార్గం...

మనిషి శరీరంలో ముఖానికి గొప్ప అందాన్ని, వింత శోభని తెచ్చేవి కురులే. నిగనిగలాడే వత్తైన కురులతో సౌందర్యం మన సొంతమౌతుంది. మరి, ఆ అందమైన కేశ సంపద తరిగిపోతే ఎలా?! జుట్టు రాలిపోవడం అనేది ఎందరినో కలతపెడుతున్న సమస్య. ముఖ్యంగా ఆడవాళ్ళను ఈ సమస్య బాగా కలచివేస్తోంది. దీనికి పరిష్కారం లేదా అంటే, ఎందుకు లేదు? ఎన్నో మార్గాలున్నాయి. కేశ సంపదను కాపాడుకునే కొన్ని పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం.
Natural Hair Care Tips Hair Fall


1. కోడిగుడ్డు తెల్లటి సొనను తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు చిట్లదు.
2. నిమ్మరసంలో ఒక స్పూనుడు ఆలివ్ ఆయిల్ కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, గంట తర్వాత తల స్నానం చేయాలి.
3. మందార ఆకులను, మందార పూవులను ముద్దగా నూరి తలకు పట్టించి, ఓ గంట తర్వాత తల స్నానం చేయాలి. కొద్ది వారాలకే మంచి ఫలితం కనిపిస్తుంది.
4. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, అందులో కాస్త నిమ్మరశం కలిపి, దాన్ని తలకు రాసి బాగా మర్దనా చేసి, గంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
5. నిమ్మరసంలో కొద్దిగా హెన్నా పౌడరు, పెరుగు, కోడిగుడ్డు లోని తెల్లటి సొన వేసి బాగా కలిపి తలకు పట్టించాలి. ఒక గంటసేపు ఉంచుకుని, తర్వాత తల స్నానం చేయాలి. వారానికి రెండుసార్ల చొప్పున కొన్నాళ్ళు ఇలా చేస్తే కుదుళ్ళు గట్టిపడతాయి. జుట్టు రాలదు. చుండ్రు సమస్య ఉంటే నివారణ అవుతుంది.
6. కొబ్బరి నూనెలో గుడ్డు సొనను కలిపి, తెల్లటి పేస్టులా తయారుచేసి, అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి, మరోసారి కలిపి కుదుళ్ళకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలకపోగా పట్టుకుచ్చులా తయారౌతుంది.
7. వేప ఆకు పొడిలో బిల్వ పత్రాలు, బిల్వ ఫలాల చూర్ణాన్ని కలిపి, నీళ్ళతో పేస్టులా తయారుచేసి తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. కొన్నాళ్ళు ఇలా చేస్తే జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి. పేలు, చుండ్రు లాంటి సమస్యలన్నీ నివారింపబడతాయి.
8. ఒక టేబుల్ స్పూన ఉసిరి పొడి, ఒక టేబుల్ స్పూన మెంతి పొడి తీసుకుని అరకప్పు పెరుగులో వేసి కలిపి, రెండు చుక్కలు యూకలిప్టస్ నూనె, కొద్దిగా బీట్రూట్ రసం వేసి మరోసారి కలిపి, రాత్రి అంతా నాననిచ్చి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. వారానికి ఒకసారి చొప్పున కొన్నాళ్ళు ఇలా చేస్తే కురులు ఎంతో ఆరోగ్యంగా తయారౌతాయి. వీటిల్లో ఏ ఒక్క పద్ధతిని పాటించినా జుట్టు రాలదు.

No comments: