ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంటిలోను టీవీ ఒక కనీస వస్తువుగా మారిపోయింది. టీవీలు లేని ఇళ్ళు చాలా అరుదు ప్రపంచ నలు మూలల నుంచి సమాచారాన్ని ప్రత్యక్షంగా మన కళ్ళకు కట్టి చూపడంలో టీవీలకు సాటి మరోటి లేదనుకోండి. కానీ ఇలా టీవీల గురించి గొప్పలు చెప్పుకుంటూ తీరిక దొరికితే టీవీలకు అతుక్కుపోయేవారికి ఈ వార్త కాస్త మింగుడు పడని విషయమే.. ఎందుకంటే ఎక్కువ సేపు టీవీలకు అతుక్కుపోవటం మధ్యపానం, ఊబకాయం కంటే భయంకరమైన రోగమని పరిశోదకులు గగ్గోలు పెడుతున్నారు. మరో విషయం ఏంటంటే ఈ రోగానికి గురయ్యే వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారట. అవును మరి ఇంటిపని మంట పని పూర్తయ్యాక మొగలిరేకులు, పూతరేకులు అంటూ టీవీసీరియల్స్‌కు అతుక్కుపోతారు కదా? టీవీ ఛానళ్ల వారుకూడా వారికి సీరియల్సనీ అవనీ ఇవనీ రకరకాల మహిళల కార్యక్రమాలతో తీరిక లేకుండా చేస్తున్నారు పాపం. ప్రత్యేక టీవీ ఛానళ్లను కూడా ఏర్పాటుచేస్తూ వారిని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తుంటే వారు మాత్రం ఏంచేస్తారు. అందుకే అన్ని రంగాలతో పాటు ఈ విషయంలో కూడా వారే ఫస్ట్.
అసలు విషయానికి వస్తే టీవీలకు అతుక్కుపోయి గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల అనారోగ్య ఆహారం తీసుకోవడం పెరుగుతుందని ఒక ఆస్ట్రేలియన్ సర్వే చెబుతుంది. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే మనం టీవీలను చూస్తూ అన్నం తినే వారిని చాలామందిని చూస్తుంటాం. సినిమా చూస్తూ కొంచెం సస్పెన్స్ వస్తే చాలు దానికి అతుక్కుపోయి తినేదాన్ని పక్కన పెడతాం. ఆ సీన్ అయ్యే వరకు మన భోజనం ఎలా పెట్టింది అలానే ఉంటుంది. టీవీ చూస్తూ ఎంత తిన్నామో తెలియకుండా తినే వాళ్లు చాలామందే ఉన్నారు. టీవీ చూస్తూ కొందరు అతిగా తింటారు, కొందరు తక్కువ తింటారు, కొందరు గంటలు గంటలు తింటారు. కొందరు ఏంతిన్నారో తెలీకుండా తింటారు. మరి ఇలా చేస్తే రోగాలు రాక మరేం వస్తాయ్.
శాస్త్రవేత్తులు చెబుతున్నదాని ప్రకారం ఒక్క గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల ఆయుష్షుకు సున్నా చుట్టినట్లేనట. ఏంటీ ఇవ్వాల్టినుంచి మీ పిల్లల్ని టీవీలు చూడకుండా కట్టడి చేద్దాం అనుకుంటున్నారా…? ఆ శాస్త్రవేత్తల అధ్యాయనాలు చెబుతున్నది కార్టూన్ నెట్వర్క్‌లు చూసే బుడతల గురించి కాదు 25 సంవత్సరాలు పైబడిన వారి గురించే. ”25 సంవత్సరాలు పైబడిన వారు రోజూ ఆరు గంటలపాటు టీవీలను చూస్తే, వారు ఒక్కోగంటకు 22 నిమిషాల చొప్పున ఆయుష్షును కోల్పోయినట్లే” అని వారంటున్నారు.
టీవీ చూడటం వల్ల ఏమాత్రం వినోదం పొందుతారోగానీ నిజంగానే ఇది ధూమపానం కన్నా భయంకరమైనదే.. ధూమపానం, మధ్యపానం లాగే ఈ టీవీ రోగం బారిన పడ్డవారు కూడా అంత తేలిగ్గా బయటకు వస్తారంటారా..? ఏంటీ… చెప్పేవాళ్లు ఏమైనా చెప్తారని వెళ్లి మళ్లీ టీవీ ఆన్ చేస్తున్నారా..? ఇలాగే రోజుకు ఆరు గంటలపాటు టీవీలకు అతుక్కుపోయారో మీ జీవిత కాలంలో 4.8 గంటలు కోల్పోయినట్లే మరి చూస్కోండి.
No comments:
Post a Comment