జీవితం రెండోసారి దొరకదని రానాకు తెలుసు.
దానిని ఎంజాయ్ చేయాలి... చేస్తాడు.
దుబారా చేయకూడదు... చేయడు.
ఫ్రెండ్స్- ఫన్ - పార్టీస్... అదొక లెవల్.
కాని తన కారు తాను నడుపుకుంటూ,తన లగేజ్‌ను తాను మోసుకుంటూ, అవసరమైతే బ్రెడ్ తిని, వీలు లేకపోతే మెట్ల మీద పడుకొని.... అది ఇంకో లెవల్!
డబ్బున్నోళ్ల అబ్బాయిల స్టీరియోటైప్ లైఫ్‌ను రానా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం ఒక సైడ్.
కాని- అమరచిత్ర కథల గురించి, తెలుగు భాష గురించి, మన కల్చరల్ లెవల్స్ గురించి అతను మాట్లాడం మాత్రం కచ్చితంగా అదర్‌సైడ్!!
హడావిడిగా కనిపిస్తున్నారు..? రానా: డిసెంబర్ మొదటి వారంలో మా చెల్లెలి పెళ్లి... కొంచెం పనుల్లో బిజీగా ఉన్నా. ఇంట్లో ఆడపిల్లకు జరిగే శుభకార్యం అవడంతో అన్ని పనులూ నెత్తినేసుకుంటున్నా. (నవ్వుతూ) మీ దగ్గరకు రావడంలో ఆలస్యం అయ్యింది కూడా అందుకే. సారీ.. ఏం అనుకోకండీ..
అయ్యో... భలే వారు... రానా: లేదండీ... ఈ బిజీ ఏదో నాకు రాసిపెట్టినట్టుంది. ఏ ముహూర్తంలో నటునిగా అడుగుపెట్టానో కానీ... అప్పట్నుంచి ఇప్పటివరకూ ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. ఇప్పుడు చెల్లి పెళ్లి అవడంతో నా అంతట నేనే గ్యాప్ క్రియేట్ చేసుకున్నానుకాని లేకపోతే ఏదో ఒక షూట్‌లోనో డబ్బింగ్‌లోనో డిస్కషన్‌లోనో ఉండేవాణ్ని. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చదువుకునేరోజులే హ్యాపీ... ఏ దిగులూ చింతా లేకుండా ఉండేవని!
టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా... మీరు ఎలాంటి స్టూడెంట్? రానా: యావరేజ్. కానీ ఇష్టమైన సబ్జెక్ట్‌లో మాత్రం మంచి మార్కులు తెచ్చుకునేవాడ్ని. (నవ్వుతూ) అకౌంట్స్‌లో 90కి తక్కువ ఎప్పుడూ రాలేదు.
తెలుగు సంగతి? రానా: తెలుగంటే నాకు మొదట్నుంచీ ఇష్టం. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివినా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకూ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే! అందుకే ‘కృష్ణంవందే జగద్గురుమ్’లో సమాసభూయిష్టమైన సంభాషణలను అలవోకగా చెప్పేశాను. నా దృష్టిలో భాష అంటే అమ్మతో సమానం! కానీ దురదృష్టం ఏంటంటే మనం దానికి రోజురోజుకూ దూరం అవుతున్నాం. నా ఇంటర్‌మీడియట్ టైమ్‌లోనే ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్లమంతా కలిపి కేవలం ఎనిమిది మందిమి ఉండేవాళ్ళం. ఇక డిగ్రీలో అయితే ముగ్గురే. ఫ్రెంచ్ క్లాస్‌లో మాత్రం 30, 40 మంది ఉండేవాళ్లు. మనం హైదరాబాద్‌లో ఫ్రెంచ్ మాట్లాడతామా? మనకెందుకు ఫ్రెంచ్? ఇప్పుడైతే ఇంకా దారుణంగా తయారైంది. ప్రస్తుతం మా కజిన్స్ అక్కడే చదువుతున్నారు. వాళ్లను ఏమైనా అడిగితే తెలుగులో సమాధానం చెప్పడం రాదు. ఒకవేళ మాట్లాడినా, ఆ తెలుగు అస్సలు వినలేం. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల కారణంగా తెలుగు భాష అడుగంటిపోతోంది.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వాళ్లతో పోలిస్తే మన తెలుగువాళ్లకి భాష పట్ల స్వాభిమానం తక్కువని అనిపిస్తుంది... ఏకీభవిస్తారా? రానా: కచ్చితంగా! అక్కడ వాళ్లల్లో ఆ ఫీలింగ్ ఎక్కువ. అంతేకాదు, అక్కడ ఎవరూ ఒకే రంగాన్ని నమ్ముకొని బ్రతకరు. సాధ్యమైనంత వరకూ ప్రతి ఒక్కరికీ వేరే రంగంలో ప్రవేశం ఉంటుంది. వాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కానివ్వండి, ఏ జాబ్‌లో అయినా ఉండనీయండి... సాయంత్రం అవ్వగానే ఏదో ఒక కళపై దృష్టిని సారిస్తాడు. నాటకం, సంగీతం, చిత్రలేఖనం... ఇలా ఏదో ఒకటి. ప్రస్తుతం మనకైతే ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకి ఈ మధ్యే జరిగిన ఒక సంఘటన చెప్తా... మా చెల్లెలి శుభలేఖను తెలుగు చిత్రకారుడు రమేష్ గురజాల ఆర్ట్‌తో డిజైన్ చేయించాం. ఆ శుభలేఖను ఇక్కడ చాలామందికి పంచాం. ఒక్కరు కూడా ఆ శుభలేఖపై ఉన్న చిత్రం గురించి మాట్లాడిన పాపానపోలేదు. కానీ బెంగళూరు, చెన్నై, ముంబైల్లో మాత్రం ఆ బొమ్మ చూసిన వారందరూ ‘రమేష్ గురజాలది కదా..’ అనడిగారు. దాన్ని బట్టి వారిలోని కళాభిరుచిని అర్థం చేసుకోవచ్చు. ఆన్ ద అదర్‌సైడ్, మనవాళ్లు ఎంత అభిరుచిహీనులో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో ఏదో విధానాలలో మార్పు రావాలి. వస్తుంది లేండీ... ఒకప్పుడు హైదరాబాద్‌లో ఉండేవారు పై చదువుల కోసం చెన్నయ్, బెంగళూర్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఈ అభివృద్దితో పాటు పరిశీలనాత్మక దృష్టి కూడా తోడైతే మనం ఎక్కడో ఉంటాం.
కాస్త టాపిక్ మారుద్దాం... మీకు భారీ విజయం రాకపోయినా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది... కారణం ఏంటంటారు? రానా: (నవ్వుతూ) ఈ ప్రశ్న ఎవరు అడిగినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకూ అర్థంకాని విషయం ఏంటంటే... లవ్‌స్టోరీల్లో నటించేవాళ్లకే రొమాంటిక్ ఇమేజ్ వస్తుంది. నేను ఇప్పటివరకూ ఒక్క లవ్‌స్టోరీ కూడా చేసింది లేదు. కానీ అమ్మాయిలు అభిమానిస్తున్నారంటే నాకే ఆశ్చర్యకరంగా ఉంటుంది. బహుశా... నా లైఫ్ స్టైల్, హైట్, నా ఫిట్‌నెస్ వాళ్లకు నచ్చి ఉండాలి.
అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడడం సరే, మీరు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారు? రానా: ప్రత్యేకమైన టేస్ట్ అంటే ఏమీలేదు. అంతేకాదు, నేను ఎవరిమీదా అంచనాలు పెట్టుకోను. ఎదుటివారి వద్ద ఉన్న మంచి లక్షణాలను వెతుక్కొని వాటితోనే సరిపెట్టుకోవడం నాకు అలవాటు. అంచనాలు పెట్టుకోకుండా పెళ్లి చేసుకున్నామనుకోండి.. లైఫ్ మొత్తం దేవుడిచ్చిన బోనస్‌లా ఉంటుంది. అంచనాలు పెట్టుకుంటే... జీవితం మొత్తం వెలితిగానే అనిపిస్తుంది. అందుకే ఫలానా లక్షణాలున్న అమ్మాయిలంటే ఇష్టం అని చెప్పలేను.
టీనేజ్‌లోగానీ, ఇప్పుడు గానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన అమ్మాయి ఎవరన్నా ఉన్నారా? రానా: అసలు నేను దేనికీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టపడను. అందుకే హారర్ సినిమాలు కూడా చూడను. రామ్‌గోపాల్‌వర్మ రెండు మూడుసార్లు తను తీసిన సినిమాలు చూడటానికి పిలిచాడు... వెళ్లలేదు! ‘అరుంధతి’ సినిమా అంటే నాకిష్టం. కానీ అనుష్క తలపై కొబ్బరికాయలు కొట్టే సీన్ వస్తే మాత్రం లేచి వచ్చేస్తా. అలాంటివి చూడ్డం దేనికీ... డిస్టర్బ్ అవ్వడం దేనికీ అని!
మీరు చాలా తెలివిగా తప్పించుకుంటారు. నేను అడిగిన ప్రశ్న వేరు... మీరు చెప్పిన సమాధానం వేరు! ‘అందంతోగానీ, ప్రవర్తనతోగానీ మిమ్మల్ని మధురమైన బాధకు గురిచేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా’ అనేది నా ప్రశ్న? రానా: చెప్పేదాకా వదిలేలా లేరే! సరే, చెబుతున్నాను రాసుకోండి... చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయి మాత్రం నన్ను కాస్త ఇబ్బంది పెట్టింది. కాని ఆ అమ్మాయి నాకు సూపర్ సీనియర్. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడలేకపోయా. పెద్ద విషయం ఏమిటంటే... ‘దమ్ మారో దమ్’ ప్రమోషన్ టైమ్‌లో చండీగర్ ఎయిర్‌పోర్ట్‌లో ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి నాకు సడెన్‌గా తారసపడింది. ఇబ్బంది అనిపించి పలకరించలేకపోయాను కానీ, ఆరోజు సాయంత్రం అభిషేక్ (బచ్చన్)తో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నా.
ఇంతకీ ఆ అమ్మాయి మిమ్మల్ని గుర్తుపట్టిందా? రానా: లేదు... నేనెవరో తెలీనట్టు బిహేవ్ చేసింది. బహుశా గుర్తుపట్టలేదనుకుంట!
అంతమందిలో అన్నేళ్ల తర్వాత కూడా ఆ అమ్మాయిని గుర్తు పట్టారంటే... గాఢంగానే ప్రేమించి ఉంటారు? రానా: ప్రేమ అనే పెద్ద మాటలొద్దండీ. అది చాలా బరువైన పదం! లేత వయసులో కలిగే ఆకర్షణ అదంతా. అయినా ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో చాలా తక్కువ మంది జనం ఉన్నారు... అందుకే గుర్తుపట్టగలిగాను.
కాని చాలామంది హీరోయిన్లకు మీరంటే ఇష్టమనీ... బిపాషా, శ్రీయ, త్రిష, రిచా గంగోపాధ్యాయ, సమీరారెడ్డి... రానా: (నవ్వుతూ) అంతేనా మీ లిస్ట్... ఇంకా లేరా! కానీ సీరియస్లీ, రోజు రోజుకీ పెరుగుతున్న ఈ లిస్ట్ వినీ వినీ నాకు ఇంక విసుగొచ్చేస్తోంది. అందుకే అసలు పట్టించుకోవడం మానేశా. ఒకసారి ఓ పేపర్ వాళ్లు నాకు ఫోన్ చేసి, ‘మీపై ఫలానా రూమర్ వినిపిస్తుంది. నిజం ఎంత?’ అనడిగారు. ‘అది తప్పండీ. అలాంటిదేం లేదు’ అని దానికి పూర్తిగా వివరణ ఇచ్చాను. రెండో రోజు ఆ రూమర్ గురించి ఒక వ్యాసం రాసేసి, కింద రానా ఇలా అన్నాడు అని చిన్న కామెంట్ పెట్టారు. అది చూడగానే చాలా కోపం వచ్చింది. అందుకే ఈ గాలివార్తల గురించి ఆలోచించడంమే మానేశా.
ఇంతమంది హీరోలును వదిలేసి మీడియా మిమ్మల్నే ఎందుకు లక్ష్యం చేస్తుందంటారు? రానా:నాకు మొదట్నుంచీ స్వతంత్య్ర భావాలెక్కువ! మనోభావాలను చంపుకొని బ్రతకలేను. నాకు తెలిసి నాలాగా స్వేచ్ఛను ఇష్టపడే హీరోలలో బాలీవుడ్‌లో రణబీర్‌కపూర్ ఒకడున్నాడంతే! పైగా నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. యాక్టర్ అవ్వకముందు ఎలా బ్రతికానో, ఇప్పటికీ అలానే బ్రతుకుతున్నాను. కానీ బయటి ప్రపంచానికి అది తెలియదు కదా! వాళ్లకి నా లైఫ్ స్టైల్ కొత్తగా అనిపిస్తుంది. అందుకే నాపై ఇన్ని రూమర్లు అని నాకనిపిస్తుంది!
ఈ రూమర్లు విని ఇంట్లోవాళ్లు ఎలా స్పందిస్తారు? రానా: (నవ్వుతూ) మాది ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అండీ... ఇలాంటివి చాలా చూశారు వాళ్లు!
హీరో హీరోయిన్ల బంధాల గురించి బయట సమాజంలో రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. వారి అభిప్రాయాల్లో నిజానిజాలెంత? రానా: నిజాలు ఉండచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రతి రంగంలోనూ లోటుపాటులు అనేవి సహజం‘సచిన్ ఈ బంతి ఇలా అడితే బావుండు’ అని అనడానికి తేలిగ్గా అనేస్తాం. కానీ గ్రౌండ్‌లోకి దిగి ఆడితే తెలుస్తుంది అది ఎంత కష్టమో. ‘ఆ నాయకుడు జనం సొమ్ము తెగ తినేస్తున్నాడు’ అని నింద వేసేస్తాం. ఆ పొజిషన్ వల్ల తను అనుభవిస్తున్న స్ట్రగుల్ ఏంటన్నది అతని స్థానంలోకెళ్లి చూస్తే తెలుస్తుంది. సినిమా రంగంలో కూడా అంతే. హీరో హీరోయిన్లు అనగానే ‘వీళ్ల మధ్య ఏదో ఉందిరా’ అని తేలిగ్గా అనేస్తారు. కానీ ఎవరి జీవితాలు అయినా దగ్గరకొచ్చి చూస్తేనే తెలుస్తుంది... వాళ్ళేంటో... ఆ స్థాయికి వెళ్లడానికి వాళ్లు అనుభవించిన స్ట్రగులు ఏంటో! అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి.
ఇండస్ట్రీలో మీకు క్లోజ్ ఫ్రెండ్..? రానా: ఇంకెవరు చరణ్. మేమిద్దరం చిన్నప్పుట్నుంచీ కలిసి చదువుకున్నాం. చెన్నయ్ టి.నగర్‌లోనే మా ఇళ్లు కూడా. ఇప్పటికీ మా స్నేహం అలాగే కంటిన్యూ అవుతోంది.
మరి త్రిష మాటేంటి? మీ ఇద్దరికీ పెళ్లి అనే రూమరు కూడా ఈ మధ్య హల్‌చల్ చేసింది? రానా: (నవ్వుతూ) ఓ ఆ రూట్లో వచ్చారా! త్రిష కూడా చరణ్ లాగే నాకు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. టి.నగర్‌లోనే తనూ ఉండేది. సౌత్ స్కోప్ మేగ్‌జైన్‌కోసం ఇద్దరం ఫోట్‌షూట్ చేశాం. వాటిని ఆధారాలుగా చూపిస్తూ ‘పెళ్లి’ అని నానా హంగామా చేసేశారు. వాళ్ళిష్టమొచ్చినట్టు రాసేశారు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు.
మీ డ్రెస్సింగ్ స్టైల్ కొత్తగా ఉంటుంది. సపరేట్‌గా డిజైనర్‌ని ఎవరైనా ఉన్నారా? రానా: నాకు సపరేట్ డిజైనర్లంటూ ఎవరూ లేరండీ! నచ్చినవి తొడుక్కుంటాను అంతే. ఇక నిజానికి నా షూ సైజ్ 13. ఈ సైజ్ షూస్ ఇండియాలో దొరకవ్. అందుకే దుబాయ్ వెళ్లి కొనుక్కుంటా. అక్కడ నా హైట్ ‘షేక్స్’ ఉంటారు కదా. అందుకే అక్కడ దొరుకుతాయ్. అక్కడకెళ్లి ఒక సూట్‌కేస్ నిండా షూస్‌నే నింపేసుకొని తెచ్చుకుంటాను.
మీ ఫిట్‌నెస్ సీక్రెట్ చెబుతారా? రానా: నేను భోజనప్రియుడ్ని. అందుకే డైటింగ్ జోలికి అస్సలు వెళ్లను. కానీ ప్రతిరోజు గంటన్నర లేక రెండు గంటలు వర్కవుట్లు చేస్తా. షూటింగ్స్ ఉంటే మాత్రం సాయంత్రం పూట చేస్తా. ఏదైనా పొద్దున్నే చేసే వ్యాయామమే ఆరోగ్యం. పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండేది. డైలీ స్విమ్మింగ్ చేసేవాడ్ని. ఇప్పుడున్న ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదు. అది మాత్రం మిస్సవుతున్నా.
ఎలాంటి కార్లను ఇష్టపడతారు? రానా: నాకు కార్ల పిచ్చి లేదండీ. చాలాకాలంగా ఒకే కారు వాడుతున్నా. అది కూడా ఈ మధ్య ‘డగ డగ డగ’ అని కొట్టుకుంటుంది. అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నా. బై ద వే, నేను డ్రైవింగ్ చండాలంగా చేస్తా!
ఎన్నో దేశాలు తిరిగుంటారు కదా. ఏ దేశాన్ని ఎక్కువగా ఇష్టపడతారు? రానా: ఇండియా అంటే ఇష్టం. తర్వాత అమెరికా ఇష్టం. అందులోనూ న్యూయార్క్ ఇంకా ఇష్టం. న్యూయార్క్ ఎందుకు ఇష్టమంటే... అక్కడ నేను ఏడాది పాటు పనిచేశా. అదొక మల్టీ కల్చరల్ సిటీ. అక్కడ అమెరికన్ ఫుడ్ ఎలా ఉంటుందో, థాయ్ ఫుడ్ కూడా అలాగే దొరుకుతుంది. ఎంత మంది ఇండియన్స్ ఉంటారో, అంత మంది కొరియన్సూ ఉంటారు. ఇంకా పలు దేశస్తులు అక్కడ నివసిస్తుంటారు. ఇన్ని నాగరికతలు కలిసి ఉండటం వల్ల, ప్రతి ఒక్కక్కరినుంచీ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు.
కారు అద్దాల్లోంచి ప్రపంచాన్ని చూసే మీకు ఇంతటి పరిశీలనాత్మక దృష్టి ఎలా సాధ్యమైంది? రానా: మొదట్నుంచీ తెలుసుకోవాలనే ఆరాటం... కొత్తగా ఏమైనా చేయాలనే ఉబలాటం... నా పరిణతికి అవే కారణం! కొత్త ప్రదేశాలను చూడటం కూడా ఇష్టపడతా. ముఖ్యంగా పుస్తకాలు ఇష్టంగా చదువుతా. అమరచిత్ర కథలంటే నాకు ప్రాణం. భాగవత, ఇతిహాసాల గూర్చిన ఎన్నో విషయాలు ఆ పుస్తకాలవల్లే నాకు తెలిశాయి. మీరు నమ్మండీ నమ్మకపోండీ.. రియల్ లైఫ్‌లో సగటు మనిషిగా జీవిస్తాన్నేను. నాకు స్టాఫ్ కూడా ఎక్కువ ఉండరు. నా కారు నేను డ్రైవ్ చేసుకుంటా. నా సామాన్లు నేనే మోసుకుంటా. షూటింగ్స్‌లో కారవాన్‌ను కూడా పెద్దగా వాడను. ఏ విషయాలనూ మరొకరితో షేర్ చేసుకోను. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ‘నా ఇష్టం’ షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. నాకు మధ్యాహ్నం పూట భోంచేసి కాసేపు పడుకోవడం అలవాటు. మలేసియాలో ఎండ ఓ రేంజ్‌లో ఉంటుంది. అంత ఎండలో కుమారస్వామి గుడిముందు ఓ గట్టుపై కచ్చీప్‌ని మొహంపై వేసుకొని పడుకున్నా.. మధ్యలో ఎందుకో కళ్లు తెరిచి చూశా. ఇద్దరు వ్యక్తులు నా మొహానికి దగ్గరగా వచ్చి తీక్షణంగా చూస్తున్నారు. వారెవరో కాదు. అలీ, జెనీలియా. ‘నీ లైఫ్‌లో ఎప్పుడన్నా అనుకున్నావా... ఇలా గుడి మెట్లపై పడుకుంటావని’ అని అడిగాడు అలీ నవ్వుతూ. ఈ మాట ఎంత లోతైనదో నాకు తెలుసు. జెన్నీ అయితే.. ‘నీ గురించి పేపర్లలో తెగ రాసేస్తుంటారు. కానీ నువ్వేంటి, ఇంత నార్మల్‌గా ఉన్నావు’ అని ఆశ్చర్యపోయింది! అదీ నా లైఫ్ స్టైల్! ఎప్పటిలానే నాకు నచ్చినట్టు ఉంటా!
- సంభాషణ: బుర్రా నరసింహ
‘నీ లైఫ్‌లో ఎప్పుడన్నా అనుకున్నావా...ఇలా గుడి మెట్లపై పడుకుంటావని’ అని అడిగాడు అలీ నవ్వుతూ. ఈ మాట ఎంత లోతైనదో నాకు తెలుసు! జెనీలియా అయితే.. ‘నీ గురించి పేపర్లలో తెగ రాసేస్తుంటారు. కానీ నువ్వేంటి, ఇంత నార్మల్‌గా ఉన్నావు’ అని ఆశ్చర్యపోయింది!
No comments:
Post a Comment