all

Wednesday, November 21, 2012

విశేషాలవిందు - వనభోజనం

భారతీయ సంస్కృతి ప్రణాళిక, విస్తరణ క్రమపద్ధతిలో జరిగినట్లు పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల ప్రయోజనాలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. గుడ్డిగా వాటిని ఆచరించటం కాక వాటిలోని పరమార్థాన్ని తెలుసుకుంటే వ్యక్తిత్వవికాసానికి, క్రమశిక్షణకు, సామాజిక వికాసానికి అవి ఎలా పనికి వస్తున్నాయో భావితరాలకు తెలియచేయగలుగుతాం. అటువంటి వాటిలో ఒకటి కార్తిక వనమహోత్సవం.

మాసాలలో ఎన్నో ప్రత్యేకతలు గలదిగా కార్తికమాసానికి విశిష్టస్థానం ఇచ్చారు మనవారు. నెలంతా పాటించవలసిన కొన్ని నియమాలను స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు... అన్నివర్గాలవారికీ సమానంగా నిర్ణయించారు. ఇంతటి సామాజిక సమన్వయం మరే మాసంలోనూ కనపడదు. మతపరమైన భేదాలు లేకుండా శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన నెల కార్తికం. సూర్యోదయానికి ముందు స్నానం, తరవాత ఉపవాసం, దైవదర్శనం, దీపారాధన, వనసమారాధన ధర్మాలు, పురాణశ్రవణం... ఇవన్నీ ప్రధానమైన కార్తిక వ్రతనియమాలు. అన్నీ ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు, సామాజిక సమైక్యతకు పనికివచ్చేవే. ముఖ్యంగా అందరూ వనభోజనాలకు వెళ్లటం ఈ నెల ప్రత్యేకం. అయితే అదొక ఆటవిడుపుగా, సరదాగా యువతరం భావిస్తోంది.

వనభోజనాలు ఎందుకు ఏర్పడ్డాయో, ఎలా చెయ్యాలో తెలుసుకోవటం అవసరం. లేకపోతే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు, వారికి తమ వైభవం చూపి ఏడిపించటానికి వనభోజనాలకు వెళ్లిన కౌరవులు గంధర్వుని చేతిలో చిక్కుకొని పాండవుల ముందు అవమానాలపాలైనట్లు కథ విషాదభోజనం అవుతుంది. సద్బుద్ధితో, భక్తి శ్రద్ధలతో వనభోజనాలకు వెళితే ‘విశేషభోజనంబు’ అవుతుంది. కార్తికమాసంలో తోటలకు వెళ్లాలి. ఉసిరిచెట్టు కింద శివకేశవులను పూజించాలి. అంతా కలసిమెలసి... అక్కడ వండుకున్న వంటలను ఉల్లాసంగా భుజించాలి. ఆటలు, పాటలు, పురాణశ్రవణం వంటివి చేయాలే తప్ప చెడ్డపనులు ఏవీ చేయకూడదు. దుస్సాహసాలు చేసి కౌరవుల్లాగ ప్రాణాలమీదికి తెచ్చుకోకూడదు.

వృక్షాలలో దైవత్వాన్ని చూసి, పూజించాలి. ప్రకృతితో మమేకం కావాలి. భ్రాతృత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా జరుపుకోవాలి. కక్షలు, కార్పణ్యాలకు వనాలు కేంద్రాలు కాకూడదు. స్కాందపురాణంలో కార్తిక మాహాత్మ్యంలో వనభోజనాల వల్లనే పోయే కొన్ని పాపాలు చెప్పారు. పూజ, ధ్యానం, జపం, తపం చేసేటప్పుడు మధ్యలో ఆపి ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా చేసి ఉంటే దాని కారణంగా వచ్చిన పాపం పోవాలంటే కార్తికంలో వనభోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు, పితృకార్యం చేసేటప్పుడు, అశుచిగా ఉన్నవాళ్లతో... మాట్లాడకూడదు. తెలిసీతెలియక అలా వచ్చిన పాపం ఈ వనభోజనంతో పోతుంది. అందరూ తప్పనిసరిగా వన భోజనాలకు వెళ్లితీరాలనే నిబంధన వల్ల ప్రకృతి పరిశీలన, సామాజిక అవగాహన, వినోదం, విహారం వంటి లాభాలు తప్పక కలుగుతాయి. ఏకాగ్రతతో పని చేసేటప్పుడూ మధ్యలో మాట్లాడకూడదు. వృత్తి, ప్రవృత్తి వ్యవహార దక్షతల్లో ఫోన్ మాట్లాడటం, టీవీలు చూడటం వంటివి తెలిసిందే. అందువల్లే వనభోజనాలు అందరికీ అత్యవసరం.

- డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్

No comments: