all

Wednesday, November 21, 2012

Obama & Michelle interview

మా ఆయన ఒబామా
‘‘ఒబామా అమెరికాకు అండగా నిలబడితే, ఆ ఒబామాకు నేను అండగా నిలబడతాను,’’ అంటారు మిషెల్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన బరాక్ ఒబామా సతీమణిగానే మనకు తెలిసిన మిషెల్... ఒక సందర్భంలో ఆయనకు సీనియర్‌గా వ్యవహరించారు. ఆయన వ్యక్తిత్వాన్నీ, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతనీ చూసి, కదిలిపోయారు, ఆయన జీవితంలో కలిసిపోయారు. మిషెల్ రాబిన్‌సన్ కాస్తా మిషెల్ ఒబామా అయ్యారు, అమెరికా ఫస్ట్ లేడీ అయ్యారు, (భర్త అధ్యక్షుడైన మాదిరిగానే) ఈ గౌరవం దక్కించుకున్న తొట్టతొలి ఆఫ్రికన్-అమెరికన్ అయ్యారు. అలాంటి
మిషెల్ ఒబామా అంతరంగం...


పూర్వ రంగం (మిస్ మిషెల్)
*నేను రెండు గదుల ఇళ్లల్లో నివసించాను, ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను, మూడు గంటల పాటు బస్సుల్లో ప్రయాణించాను. నేను క్లాసులో ఎప్పుడూ ఎ గ్రేడ్ విద్యార్థినే. కానీ అవి సంపాదించింది ఒక మామూలు పాఠశాలలోనే తప్ప సంపన్నుల స్కూల్లో కాదని అందరికీ ఇట్టే తెలిసిపోయేది. కాలేజీ అయిపోయి, నా కెరీర్ మొదలుపెట్టాక మాత్రమే... నేను ఎదగడానికి ఎంత తక్కువ అవకాశాలు వచ్చాయో పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. ప్రతి చిన్నారీ బడికి వెళ్లాలి, అందరికీ నాణ్యమైన విద్య లభించాలి, కష్టించే పనిచేసేవారికి మన్నన దక్కే వ్యవస్థ ఉండాలి, అందరికీ అందుబాటులో ఆరోగ్యసేవలు ఉండాలి; ఇదే మనం మన పిల్లలకు వారసత్వంగా అందించే అమెరికా అయ్యుండాలి. ఇది నా కల!

* హార్వర్డ్ లా స్కూల్లో చదువు ముగిసిన తర్వాత, చికాగోలోని ‘సిడ్లీ ఆస్టిన్ లా ఫర్మ్’లో పనిచేస్తున్నాను. వేసవిలో ఇంటెర్న్‌షిప్‌కోసం వచ్చాడు బరాక్. అప్పుడే తనను తొలిసారి చూడటం. నేను ఆయనకు సలహాదారు(హార్వర్డ్‌లో మిషెల్ చదువు పూర్తయిన సంవత్సరం బరాక్ అక్కడ చేరారు. 1988. వయసులో మిషెల్‌కంటే పెద్దయినా ఈ లెక్కన జూనియర్). తన భాగస్వాములతో ఆయన సరిగ్గా కలిసేట్టు చూసుకోవడం, ఎప్పుడైనా లంచ్‌కు తీసుకెళ్లడం; చేస్తుండేదాన్ని. బరాక్ పనితీరు నచ్చిన పార్ట్‌నర్స్... ఆయన చేతికి డిగ్రీ వచ్చాక మళ్లీ ఇక్కడే ఉద్యోగంలో చేరేలా నన్ను ఒప్పించమన్నారు. నేను ఆయన్ని ఒప్పించడం అటుంచితే, ఆయనే నన్ను ఇంకోరకంగా ఒప్పించారు.

* బరాక్ తన గురించి తాను ఎంతమాత్రమూ శ్రద్ధ తీసుకునే రకం కాదు. కానీ చాలా తెలివైనవాడు. అలా తనమీద సదభిప్రాయం ఏర్పడింది. ఒకరోజు ఉన్నట్టుండి ‘బయటికి వెళ్దామా?’ అని అడిగాడు. ‘డేట్’కోసమని అర్థమైంది. ‘సారీ, ఉద్యోగాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ కలపదలుచుకోలేదు,’ అని జవాబిచ్చాను, మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ. తర్వాత ఒక చర్చ్‌కు ఆహ్వానించాడు. అక్కడాయన కమ్యూనిటీ ఆర్గనైజర్. దక్షిణాదిలో చర్చిలకు అనుసంధానమై జరుగుతున్న ఒక శిక్షణా కార్యక్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎక్కువగా ఆఫ్రికన్-అమెరికన్లు, అందునా ఒంటరి మహిళల కోసం ఆయన పనిచేస్తున్నాడు. అది నన్ను ఆలోచనలో పడేసింది. సూటుబూటు వేసుకుని కార్పొరేట్ సంస్థకు వచ్చే ఈయన మామూలు దుస్తుల్లో ఇక్కడ పనిచేస్తున్నాడు. వీళ్లంతా నాలాంటివాళ్లే, నాలా పెరిగినవాళ్లే, చెప్పాలంటే నా అంత మెరుగైన జీవితం, అవకాశాలు కూడా లేనివాళ్లు. ఉద్యోగం, సేవ... ఈ రెండు ప్రపంచాల్లోనూ ఆయన సులువుగా ఇమిడిపోయి పనిచేస్తున్నాడు. అది నన్ను కదిలించింది. నేను ఆలోచించలేని విషయాల్ని నేను ఆలోచించని కోణాల్లో ఈయన ఆలోచించాడు. నేను అందరి జీవితం మారాలి అనుకుంటున్నాను. మరి దానికోసం నేను ఏం చేస్తున్నాను?

*సమాజంలో మార్పు రావాలంటే దానికోసం చొక్కా చేతులు పైకి మడిచి పనిచేయాలి. అలాగని ఈ మార్పు కేవలం ఉద్వేగంతో సంబంధం ఉన్నది కాదు, కేవలం త్యాగాలు చేయడమే సరిపోదు. ఆ పని వ్యవస్థీకృతంగా చేయాలి, దానికో వ్యూహరచన ఉండలి. ఇద్దరమూ సేవారంగంలోకి రాదల్చుకున్న యువతను ప్రోత్సహించడం కోసం చికాగోలో ‘పబ్లిక్ ఎల్లీస్’ ప్రారంభించాం. ఒకరోజు ఆ గ్రూపులో చేరిన జోస్ రికో తాను సొంతంగా పేదపిల్లల కోసం ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నానన్నాడు. ‘మరి దానికోసం ఏం చేస్తున్నావు?’ తను ఏం చేయాలో ఆలోచించలేదు. బరాక్ అప్పుడు ఒక స్కూల్ రిఫార్మ్ గ్రూపులో పనిచేస్తున్నాడు. వెంటనే ఇద్దరూ కలిసేలా చూశాను. ఎలా చేయాలో స్పష్టత వచ్చింది. తర్వాత ఆ పాఠశాల ప్రారంభమైంది.

ప్రొఫైల్

పేరు : మిషెల్ ఒబామా
తల్లిదండ్రులు : మరియన్, ఫ్రేజర్ రాబిన్సన్ (వాటర్ ప్లాంట్ ఉద్యోగి)
పుట్టింది : చికాగో (అమెరికా)
పుట్టిన రోజు : జనవరి 17, 1964
చదువు : హార్వర్డ్ లా స్కూల్‌నుంచి ‘జ్యూరిస్ డాక్టర్’ పట్టా పొందారు.
న్యాయవాదిగా పనిచేశారు.
ప్రత్యేకత : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన బరాక్ ఒబామా భార్య.
మొదటి ‘ఆఫ్రికన్-అమెరికన్ ప్రథమ మహిళ’.
పిల్లలు : మాలియా(14), సాషా(11)
ఆరాధించే వ్యక్తి : కొరెట్టా స్కాట్ కింగ్ (రచయిత్రి,
పౌరహక్కుల నాయకురాలు,
మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ శ్రీమతి)

మధ్య రంగం (మిసెస్ ఒబామా)

*(వారిద్దరూ కలిసి చూసిన మొదటిసినిమా ‘డు ద రైట్ థింగ్’. వారి పెళ్లి 1992లో జరిగింది. అమ్మాయిలు మాలియా, సాషా 1998, 2001ల్లో పుట్టారు.) పొద్దున ఐదు, ఆరింటికల్లా లేస్తాను. పిల్లల్ని స్కూలుకు రెడీ చేయడం, బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేయడం, వాళ్లు తినేట్టు చూడటం; ఈ మధ్యలో చేతులు ఆడుతాయి, కాళ్లు నర్తిస్తాయి, ‘మమ్మీ’ అన్న మాటలు మోతెక్కుతాయి; వాళ్లకు బై చెప్పేసేలోగా ఒక పెద్ద సర్కస్ ముగుస్తుంది.
పిల్లలను అతిగారాబం చేయను. వాళ్ల మంచాలు వాళ్లు సర్దుకునేట్టు, హోమ్‌వర్క్ రెండోసారి చెప్పకుండానే చేసుకునేట్టుగా చూస్తాను. ముగ్గురమూ కచ్చితంగా వాళ్ల క్లాసులో ఇవ్వాళ ఏం జరిగిందో మాట్లాడుకుంటాం. వాళ్లు చెప్పే ముచ్చట్లు వినడం ఎంతో బాగుంటుంది.

* బరాక్ అధ్యక్షుడిగా మొదటిసారి పోటీ చేయదల్చినప్పుడు ఆయన మీద ఉన్న ఫిర్యాదులు: ఆయన మూడేళ్లు మాత్రమే సెనేట్‌లో పనిచేశాడు, ఇంకొంచెం అనుభవం ఉంటే బాగుండేది. చాలాసార్లు రాజకీయాల్ని ఈ సంకుచిత కొలతల్లోనే చూస్తారు. వాషింగ్టన్‌లో ఏళ్ల తరబడి ఉండటమో, ఒక పెద్ద సంస్థను విజయవంతంగా లాభాలబాటలో నడిపించడమో ఇవేనా అర్హతలు! బరాక్ వీధుల్లో పనిచేశాడు, ప్రజలతో కలిసి తిరిగాడు, వాళ్ల హక్కుల కోసం నిలబడ్డాడు, ఉద్యోగాల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. తలుచుకుంటే వాల్‌స్ట్రీట్ కోసం పనిచేయగలిగేవాడు, ఒక కంపెనీకి సీఈఓ కాగలిగేవాడు, కానీ తన ఆయన ఆశయాలు వేరు. బరాక్‌కు ఒక కుటుంబం బతకడం కోసం ఎలా పోరాడుతుందో తెలుసు. తనతో రాజకీయంగా విభేదించేవాళ్లు కూడా బరాక్‌ను నచ్చకుండా ఉండరు, వాళ్లు విభేదిస్తారంతే!

* మొదటిసారి బరాక్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నన్ను రమ్మని పిలిచినప్పుడు, నేనో షరతు పెట్టాను. నేను రావాలంటే నువ్వు కచ్చితంగా స్మోకింగ్ మానేయాలన్నాను. ఒప్పుకున్నాడు. తర్వాత మహిళలతో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ, వారి కష్టాలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. జాతి, ఆర్థిక నేపథ్యం, రాష్ట్రం, ఇవేవీ లెక్కలోకి రావు. ఉమ్మడిగా అందరూ కుటుంబాలనూ, దేశాన్నీ ప్రేమించేవాళ్లు. ఇంటిపనినీ, బయటిపనినీ సమన్వయం చేసుకోవడానికి సాము చేస్తున్నవాళ్లు. అదొక గొప్ప అనుభవం.

*నా కూతుళ్లు ఎప్పుడైనా నా ప్రథమ ప్రయారిటీ. ఎప్పుడైనా ఇంటినుంచి దూరంగా ఉండి, తిరిగి వెళ్లేసరికి వాలిపోయిన వారి ముఖాలను చూడటం నాకు బాగుండదు. కాబట్టి, వాళ్లను నిత్యం సంతోషంగా ఉంచడమే ఒక తల్లిగా నా బాధ్యత. ఎప్పుడైనా నేను ఇంట్లో ఉండే వీలులేనప్పుడు అమ్మ ఇంటికొస్తుంది. అమ్మానాన్న దగ్గరలేనప్పుడు అమ్మమ్మ ఉంటుందన్నమాట. ఇక అమ్మమ్మ అమ్మమ్మేగా!

* భర్త ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం. ఆయన బయటికి వెళ్లినప్పుడు సరైనదే తింటున్నారా? లేదా? కూడా చూసుకుంటాను. అలాగని ప్రతిదానికీ వద్దు అనలేం కూడా. ఎప్పుడోసారి ఐస్‌క్రీమ్, ఓసారి పిజ్జా, ఎప్పుడైనా బీర్... దానికి చూసీచూడనట్టుండాలి. ఆయనకు హద్దులు తెలుసు. ఎప్పుడైనా బయటికి వెళ్లారనుకుందాం, ఎవరైనా ప్రేమగా ఐస్‌క్రీమ్ ఆఫర్ చేస్తే వద్దనకూడదు కదా! మనం ఎవరికీ ‘నో’ చెప్పొద్దన్నట్టుగా పెరిగాం కదా!

44వ అధ్యక్షుడు ఒబామాకు నాలుగు ప్రశ్నలు
ప్రభావితం చేసిన గొప్పవాళ్లు?
అబ్రహాం లింకన్, మహాత్మాగాంధీ. ఇద్దరిలోనూ నచ్చేదేమిటంటే, ఎంతో ఒత్తిడిలో కూడా వాళ్లు సమాజంలో గుణాత్మకమైన మార్పును తేగలిగారు, అదీ వాళ్ల వ్యక్తిగత విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా.

ఎప్పుడు అబద్ధం ఆడుతారు?
ఉదాహరణకు, ‘‘చాలా బాగున్నారు,’’ అంటాం. కానీ వాళ్లుండరు. ‘‘వండర్‌ఫుల్ డ్రెస్,’’ అనేస్తాం. అదేమీ కాదు. ఎదుటివాళ్లను నొప్పించని అబద్ధాలు.

పశ్చాత్తాపపడే విషయాలు?
ఒక్క సంగీతవాద్యమైనా నేర్చుకోలేకపోవడం, స్పానిష్ మాట్లాడలేకపోవడం(స్కూల్లో దానిమీద మరింత శ్రద్ధ వహించాల్సింది).
మూడు ముక్కల్లో మిషెల్...
బ్యూటిఫుల్, స్మార్ట్, ఫన్నీ.

ఉత్తర రంగం (ఫస్ట్ లేడీ)
(2008లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికయ్యాడు.)

* జార్జిబుష్‌ను కలవడానికి మొదటిసారి వైట్‌హౌజ్‌కు వచ్చాం. మేము వస్తుండగా ప్రెసిడెంట్ కాన్వాయ్ ముందు వెళ్తోంది. సుమారు 20 కార్లు! రైలు బోగీ తప్ప అందులో అన్ని వాహనాలున్నాయి! అందుకే అప్పుడప్పుడూ బరాక్‌ను టీజ్ చేస్తుంటాను: నీకు గుర్రబ్బండీ ఉంది, స్లెడ్జ్ ఉంది, బైక్ ఉంది, విమానం ఉంది...

* ప్రత్యేకించి రాత్రిపూట, అన్ని లైట్లు వేసివున్నప్పుడు బయటినుంచి శ్వేతసౌధంలోకి అడుగిడుతుంటే మహాద్భుతంగా ఉంటుంది. ఇందులో నిద్రపోగలగడం ఒక గౌరవం. పైగా ఇప్పటికిప్పుడు నీకు ‘పై’ తినాలనిపిస్తే పై వస్తుంది, ఏదైనా పాడైపోతే గంటలోనే రిపేర్ అవుతుంది, ఒక్క గంటలోపలే. అలాగని శ్వేతసౌధం మాది కాదు, ఏ ఒక్క కుటుంబమో దీనికి హక్కుదారు కాదు, ఇది ప్రజలది.

* సుమారు వంద మంది ఇంటిని మెయింటెయిన్ చేస్తారు. వాళ్లందరినీ పేరుపేరునా తెలుసుకుంటాను, అందరమూ ఒకే ఇంట్లో ఉంటున్నట్టు కదా! మా పిల్లల్ని కూడా అందరు పిల్లల్లాగే చూస్తాను. పిల్లల్ని పిల్లల్లాగే పెంచాలి, యువరాణుల్లా కాదు. వాళ్లు టేబుళ్లు సర్దుతారు, కిచెన్‌లోంచి భోజనం తేవడంలో సాయంచేస్తారు. సిబ్బందికి చెబుతాను: పనులు చేయనీయకుండా పిల్లల్ని చెడగొట్టకండి, కావాలంటే వాళ్లమ్మకు శ్రమ తగ్గించండి.

*పిల్లలు చదువుకునేచోట నేను ఫస్ట్ లేడీ అనో, ఒబామా భార్య అనో ఏదీ చెప్పను. ‘నేను మిషెల్, మాలియా, సాషా వాళ్లమ్మను,’ అని మాత్రమే చెబుతాను. మీరు ఒక తల్లిగా ఇంకో తల్లితో కూర్చుని మాట్లాడుతూవుంటే ఈ గౌరవ బిరుదులన్నీ కరిగిపోతాయి. పిల్లలు మాత్రమే టాపిక్ అవుతారు.

*నాన్న రాత్రి భోజనానికి ఉండటం, చిన్న చిన్న మాటలు తింటూ మాట్లాడుకోవడం, పొద్దున లేస్తూనే పిల్లలు తండ్రిని చూడగలగడం, రాత్రి పడుకునేప్పుడు చిన్నముద్దు అందు కోవడం; ఇలాంటివి చాలా కుటుంబాల్లో అరుదుగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు చాలా ఏళ్లుగా మేము ఎలా ఉన్నామో, ఇప్పుడూ అలాగే ఉన్నాం.

బరాక్‌తో కూడా నిత్యం టచ్‌లో ఉంటాను. ఇద్దరమూ ‘బ్లాక్‌బెర్రీస్’ వెంట తీసుకెళ్తాం. మాట్లాడుకుంటాం, మెసేజెస్ ఇచ్చుకుంటాం. అది చిన్నదే కావొచ్చు, దగ్గరగా ఉన్నట్టుంటుంది. ఖాళీ సమయాల్లో బయటికి వెళ్తాం, బైక్ రైడింగ్, ఈత కొట్టడం మా అందరికీ ఇష్టం. ఎప్పుడైనా వాతావరణం అనుకూలంగా లేకపోతే ఇంట్లోనే ఉండిపోయి ఏదైనా సినిమా చూస్తాం, పుస్తకాలు చదువుతాం. మీకు తెలుసా? బరాక్, మలియా ఇద్దరూ కలిసి హారీపాటర్ సిరీస్ మొత్తం గట్టిగా బయటికి చదివారు.

* ‘ప్రథమ మహిళ’ అనేది ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగం. అదృష్టవశాత్తూ ఆర్థికవ్యవస్థను చక్కబెట్టాల్సిన బాధ్యత నామీద లేదు. కానీ అందరినీ కలవాలి, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరినీ పరామర్శించాలి, ఇక్కడికి ఎవరినైతే ఆహ్వానిస్తామో, నేనూ వాళ్ల దగ్గరికి వెళ్లాలనుకుంటాను. అది పరస్పరం జరిగినప్పుడు ప్రేమ మరింత బలపడుతుంది. ‘నా దగ్గరికే వాళ్లు రావాలి’ ధోరణి ఉండకూడదనుకుంటాను.

*మనిషి మానసికంగా, శారీరకంగా రెండు విధాలుగా ఆరోగ్యంగా ఉంటేనే పూర్తి సంతోషంగా ఉండగలం. వారానికి మూడు నాలుగు రోజులు కచ్చితంగా గంటపాటు జిమ్‌కెళ్తాను, ట్రెడ్‌మిల్ ఎక్కుతాను, బరువులు ఎత్తుతాను. ఇక నేను ఎక్కడికి వెళ్లినా వాళ్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వ్యాయామం ఎంత అవసరం? ఇవి కచ్చితంగా మాట్లాడుతాను, ముఖ్యంగా మహిళలతో. ఎందుకంటే తప్పకుండా చేయాల్సిన పనుల జాబితాలో వాళ్లని వాళ్లు అట్టడుగున వేసుకుంటారు. సరైన పోషణ అలవర్చుకోండి, తాజా ఆహారం తీసుకోండి, మీ పెరట్లో పెరిగిన టమోటాలు మార్కెట్లో కొనేవాటికంటే భిన్నమైన రుచిని కలిగివుంటాయి, కృత్రిమ పదార్థాలు కలగలిసిన వాటిని తినొద్దు; అందరికీ నొక్కి చెబుతూనే ఉంటాను, లక్షలమందితో కరచాలనం చేస్తూనేవుంటాను.

‘నల్లమ్మాయితో గది పంచుకోను’
* మిషెల్ పూర్వీకులు అమెరికాలో బానిసత్వాన్ని అనుభవించారు.
* ఒక లేడీ ప్రొఫెసర్ ప్రోత్సాహంతో కాలేజీ ఫ్యాకల్టీ, స్టాఫ్ వాళ్ల పిల్లలకు కొంతకాలం మిషెల్ డే-కేర్ సెంటర్ నిర్వహించారు.
* {పిన్స్‌టన్ యూనివర్సిటీలో మిషెల్ చదువుతున్నప్పుడు హాస్టల్లో తనతో గది పంచుకోవాల్సిన రూమ్‌మేట్ తల్లిదండ్రులు ఒక నల్లమ్మాయితో కలిసి ఉండటాన్ని ఒప్పుకోలేదట.
* మిషెల్, ఒబామాలకున్న ముద్దుపేర్లు: ఫ్లోటస్-ఫస్ట్ లేడీ ఆఫ్ ద యునెటైడ్ స్టేట్స్; పోటస్-ప్రెసిడెంట్ ఆఫ్ ద యునెటైడ్ స్టేట్స్.

‘‘బో’లా పుట్టాలి’
* ‘‘కొంతమంది వాళ్లు అనుకున్నదానిమీదే మొండిగా నిలబడుతారు. ఇంత సంక్లిష్ట సమాజంలో అసలు సత్యం అనేది ఎక్కడో మధ్యస్తంగా ఉంటుంది. నేను అంత మూర్ఖపు క్షణంలో ఉండకుండా చూసుకుంటాను.’’
* ‘‘వచ్చే జన్మలో ‘బో’(వాళ్ల పెంపుడుకుక్క)లా పుట్టాలనుకుంటున్నాను. అలాగని కుక్కగా కాదు, కేవలం ‘బో’గా మాత్రమే. వాడిది చాలా సుఖప్రదమైన జీవితం.’’

- ఆర్.ఆర్.

 

Listings                                                                                                                                          Listings
Download e-paper
Sakshi Toolbar
%%CACHEBUSTER%%
Home |News |Business |Sports |Cinema |Blogs|

 
 
 
 
 
 

No comments: